Telugu Movie News | Telugu News | Cinema News

టీమిండియా చివరి వన్డేలో అపూర్వ విజయం !

2

టీమిండియా చివరి వన్డేలో అపూర్వ విజయం !

విశాఖ తీరంలో టీమిండియా నిర్ణయాత్మక చివరి వన్డేలో అపూర్వ విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (100 నాటౌట్‌; 85 బంతుల్లో 13×4, 2×6) శతకంతో, కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ (65; 63 బంతుల్లో 8×4 1×6) అర్ధశతకంతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యం అలవోకగా కరిగిపోయింది. రెండు వికెట్లు నష్టపోయి 32.1 ఓవర్లకే గెలుపు తలుపు తట్టింది. మ్యాచ్‌లో శిఖర్‌ ఇన్నింగ్నే హైలేట్‌. జట్టు స్కోరు 14 పరుగులకే సారథి రోహిత్‌ శర్మ (7) పెవిలియన్‌ చేరిన దశ నుంచి అతడు అద్వితీయంగా ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

చక్కని షాట్లు ఆడిన అయ్యర్‌ 15.2వ బంతికి అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగాడు. ఐతే జట్టు స్కోరు 149 వద్ద పెరీరా వేసిన 23వ ఓవర్‌లో ఔటవ్వడంతో శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ (26 నాటౌట్‌; 31 బంతుల్లో 3×4) సహకారంతో అర్ధశతకం సాధించిన తర్వాత గబ్బర్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. ఓ వైపు చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో సెంచరీ చేస్తాడా లేదా అన్న అనుమానం కలిగింది. దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుని వరుసగా బౌడరీలు, సిక్సర్లు బాది కెరీర్‌లో 12వ శతకం సాధించాడు. టీమిండియాకు విజయం అందించాడు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ, తిసార పెరీరా తలో వికెట్‌ తీశారు.

అంతకు ముందు శ్రీలంక జట్టును టీమిండియా మోతాదు స్కోరుకే కుప్పకూల్చింది. మణికట్టు ద్వయం యజ్వేంద్ర చాహల్‌ (3/46), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/42) స్పిన్‌ మాయాజాలానికి పర్యాటక జట్టు 44.5 ఓవర్లకు 215 పరుగులకే పరిమితమైంది. 17 ఓవర్లకు 100/1తో పటిష్ఠ స్థితిలో ఉన్న ఆ జట్టును వీరిద్దరూ కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టారు. వైవిధ్యమైన.. విభిన్నమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. చాహల్‌ మూడు మెయిడిన్‌ ఓవర్లు విసిరాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు!

శ్రీలంకను ఆదిలోనే దెబ్బ!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను ఆదిలోనే దెబ్బకొట్టాడు బుమ్రా. నాలుగో ఓవర్‌ నాలుగో బంతికి జట్టు స్కోరు 15 వద్ద ఓపెనర్‌ దనుష్క గుణతిలక (13)ను పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాతే మొదలైంది అసలైన ఆట. వన్‌డౌన్‌లో వచ్చిన సాదీర సమరవిక్రమ (42; 57 బంతుల్లో 5×4)తో కలిసి మరో ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (95; 82 బంతుల్లో 12×4, 3×6) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్‌ పాండ్యను లక్ష్యంగా చేసుకుని వేగంగా పరుగులు సాధించాడు. మరోవైపు సమరవిక్రమ సైతం వేగం పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆ జట్టు 153 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయి దాటింది. జట్టు స్కోరు 136 వద్ద సమర విక్రమను చాహల్‌ ఔట్‌ చేసి పెవిలియన్‌ పంపించాడు.

 

శ్రీలంక ఇన్నింగ్స్‌లో తరంగ ఔట్‌ కావడమే కీలక మలుపు. కుల్‌దీప్‌ యాదవ్‌ వూరిస్తూ వేసిన 27.1వ బంతికి ఎంఎస్‌ ధోనీ అతడిని అత్యంత చాకచక్యంగా స్టంపౌట్‌ చేశాడు. అప్పుడు స్కోరు 160. అతడి బ్యాటింగ్‌ చూస్తుంటే లంక స్కోరు 300 దాటేలా కనిపించింది. ఇక వూపుమీద కనిపించిన నిరోషన్‌ డిక్వెలా (8)ను కుల్‌దీప్‌.. ఏంజెలో మాథ్యూస్‌ (17)ను చాహల్‌ ఔట్‌ చేయడంతో శ్రీలంక పతనం వేగం పుంజుకుంది. మణికట్టు మాంత్రిక ద్వయం బౌలింగ్‌ దాడి పెంచడంతో శ్రీలంక వెంటవెంటనే పెరీరా, పతిరన, ధనంజయ వికెట్లు చేజార్చుకుంది. 30.5 ఓవర్లకు 210/8తో నిలిచింది. 211 పరుగుల వద్ద సురంగ లక్మల్‌ను హార్దిక్‌ ఎల్బీ చేశాడు. మరో నాలుగు పరుగులకే చివరి వరకు నిలిచిన అసేల గుణతిలక (17; 52 బంతుల్లో)ను భువి పెవిలియన్‌ పంపించడంతో శ్రీలంక 215కు పరిమితమైంది. పాండ్య 2, భువి, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

Leave A Reply

Your email address will not be published.