Telugu Movie News | Telugu News | Cinema News

ఆ ఖాతాల నుంచి.. ఎస్‌బీఐ వసూలు చేసిన ఛార్జీలు రూ.1771కోట్లు

24

ఆ ఖాతాల నుంచి.. ఎస్‌బీఐ వసూలు చేసిన ఛార్జీలు రూ.1771కోట్లు

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌) ఉండాలి. అలా లేకపోతే ఏ బ్యాంకు అయినా కచ్చితంగా రుసుములు వసూలు చేస్తుంది. అలా కనీస నగదు నిల్వలేని ఖాతాలపై అపరాధ రుసుము విధించడం ద్వారా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు రూ.1771కోట్లు వచ్చాయి. 2017 ఏప్రిల్‌-నవంబరు మధ్య ఆయా ఖాతాల నుంచి ఎస్‌బీఐ ఈ ఛార్జీలను వసూలు చేసిందని నివేదికల ద్వారా వెల్లడైంది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి బ్యాంకు నికర లాభం రూ.1,581.55 కోట్ల కన్నా ఇది ఎక్కువ కాగా, ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య వచ్చిన నికరలాభం రూ.3,586 కోట్లలో సగం రుసుముల ద్వారా వచ్చినట్లైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కనీస నగదు నిల్వపై ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయలేదు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలను వసూలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.

ఎస్‌బీఐలో మొత్తం 42కోట్ల పొదుపు ఖాతాలు ఉండగా, అందులో 13కోట్లు సాధారణ పొదుపు ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలే కావడం గమనార్హం. అయితే వీటిపై ఎలాంటి ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేయలేదు. కొత్త సంవత్సర కానుకగా సోమవారం ఎస్‌బీఐ 30 బేసిస్‌ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. దీని వల్ల వడ్డీరేటు బీపీఎల్‌ఆర్‌ విధానంలో కొనసాగుతున్న 80లక్షల మంది రుణ గ్రహీతలకు కొంత భారం తగ్గనుంది.

Comments are closed.