Telugu Movie News | Telugu News | Cinema News

పవన్‌ వల్ల మళ్లీ ట్విటర్‌లోకి వర్మ

28

పవన్‌ వల్ల మళ్లీ ట్విటర్‌లోకి వర్మ

హైదరాబాద్‌: ‘ఇకపై కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మాట్లాడుతాను.. ట్విటర్‌ నుంచి తప్పుకొంటున్నాను’ అంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గత ఏడాది మే 27న చివరి ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో ఎటువంటి ట్వీట్‌ చేయకుండా.. దానికి దూరంగా ఉన్నారు. కేవలం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. తన ట్విటర్‌ ఖాతా 27/5/2009లో పుట్టిందని, 27/5/2017లో మరణించిందని కూడా రాసుకొచ్చారు. అయితే ఆయన ట్విటర్లోకి మళ్లీ వచ్చారు. దీనికి కారణం ఏదో కాదట.. పవన్‌కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా అని చెబుతున్నారు వర్మ.

మళ్లీ రెండోసారి ట్విటర్‌లోకి వచ్చానని వర్మ మంగళవారం ట్వీట్‌ చేశారు. అందరికీ తన శైలిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ‘ట్విటర్‌ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన నేను పీకే (పవన్‌కల్యాణ్‌) ‘అజ్ఞాతవాసి’తో స్ఫూర్తి పొంది మళ్లీ వచ్చా’ అంటూ వర్మ మరో ట్వీట్‌ చేశారు.

వెంటనే రజనీకాంత్‌ రాజకీయాల గురించి ప్రస్తావించారు. ‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన తీరు, ఆ క్షణం ఆయనలో కనిపించిన పవర్‌ను ఇప్పటి వరకు ఆయనలో ఎప్పుడూ చూడలేదు. నా అంచనా ప్రకారం తమిళనాడులోని ప్రతి ఒక్కరు ఆయనకే ఓటు వేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పోటీ చేయాలి అనుకున్నా అది మూర్ఖత్వం అవుతుంది’ అని వర్మ అన్నారు.

Comments are closed.