Divorce Celebration.. మ్యారేజ్ ఇన్విటేషన్లే కాదండోయ్. బ్రేకప్ ఇన్విటేషన్లు కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయ్. పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ వైభోగం పదికాలాల పాటు ఓ మధుర జ్ఞాపకంలా నిలిచిపోవాలని శుభలేఖలు వేయించుకుంటాం. రకరకాల డిజైన్లలో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్లు ప్లాన్ చేస్తుంటాం.
అయితే, విడాకులకేం తక్కువ. తగ్గేదే లే.. విడాకుల కోసం కూడా ఇన్విటేషన్లున్నాయండోయ్. మంచి మంచి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీలు గట్రా మ్యారేజ్ బ్యూరోలు వున్నట్లే, విడాకుల కోసం కూడా కొన్ని ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తున్నాయ్.
పెళ్లి చేసుకోవడమే కాదు, విడాకులు తీసుకోవడం కూడా ఏమంత ఈజీ కాదు, అప్లై చేశాకా, కొన్ని నెలలూ, సంవత్సరాల తరబడి పోరాటం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కొందరు మగవాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఈ లోపల సర్వం గోవిందాయస్వాహా.! అయిపోతుంది.
Divorce Celebration.. మగవాళ్లకు మాత్రమేనండోయ్.!
అందుకే అలాంటి మగవాళ్ల కోసం మాత్రమే ఏర్పాటైన సంస్థ ఇది. భార్య బాధితులై నానా రకాల హింసల పాలవుతున్న మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విడాకుల సంస్థ. ఈ సంస్థ పేరు భాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నెలకొల్పబడింది ఈ సరికొత్త విడాకుల సంస్థ.

గత రెండున్నరేళ్లుగా భార్యా బాధిత భర్తల కోసం ఈ సంస్థ చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం ద్వారా 18 మందికి విడాకులు ఇప్పించింది. ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ చాలా వేడుకగా నిర్వహిస్తుందట. పెళ్లిని సాంప్రదాయబద్ధంగా చేసినట్లే, విడాకుల పర్వాన్ని కూడా అంతే సాంప్రదాయబద్ధంగానే చేస్తారటండోయ్.
సరికొత్త స్వేచ్ఛా జీవితానికి నూతన ఆరంభం..
విడాకుల ఫంక్షన్‌లో మగవాళ్లు తమ స్వేచ్ఛని సెలబ్రేట్ చేసుకోవడానికి చేయాల్సిన అన్ని ఘట్టాలూ ఈ వేడుకలో వుంటాయట. వివాహ మాల నిమజ్జనం, మనసును శుభ్రపరిచే అగ్ని హోత్రం వంటి రకరకాల కార్యక్రమాలతో పాటూ, స్పెషల్ డివోర్స్ ఇన్విటేషన్ కూడా వుంటుందట. అదేనండీ విడాకుల ఆహ్వాన పత్రిక అన్నమాట.
విడాకుల కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చిందనీ, కానీ, ఈ సంస్థ ద్వారా రెండు మూడు నెలల్లోనే విడాకులు తీసుకునే అవకాశం కలిగిందనీ చెబుతున్నారు ఇక్కడ విడాకులు తీసుకున్న కొందరు మగ పుంగవులు. అంతేకాదు, ఈ సంస్థ నిర్వహిస్తున్న విడాకుల ఫంక్షన్ ద్వారా తమకు కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు తగిన ఆత్మ విశ్వాసం అందిందనీ ఈ సంస్థకు జై కొడుతున్నారు.