కైలాస మందిరం.. పేరులో ‘కైలాసం’ వుంది కదా అని కైలాసంలో నిర్మించిన కట్టడం గురించి మాట్లాడుతున్నామా.? అనుకోవద్దు. ఇది భూలోక కైలాసమన్నమాట. పరమేశ్వరుడు స్వయానా భూమి మీద వెలసిన మందిరం ముచ్చటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
అజంతా ఎల్లోరా గుహల గురించి వినే వుంటాం కదా.. అజంతా గుహల్ని పక్కన పెడితే, ఎల్లోరా గుహల్లో చాలా చాలా అద్భుతాలు దాగి వున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ అద్భుతాల్లోని ఓ అపురూపమైన అద్భుత దేవాలయమే కైలాస మందిరం.
ఎల్లోరా గుహల్లోని 16 వ గుహ మిస్టరీ
మొత్తం 34 ఎల్లోరా గుహల్లోని 16 వ గుహలో ఈ కైలాస దేవాలయం వుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఏక శిలా దేవాలయంగా కైలాస దేవాలయం ప్రసిద్ధి కెక్కింది. ఈ ఆలయ నిర్మాణం అణువణువునా అద్భుతమే. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించడం ఎలా సాధ్యమైంది.? ఇప్పటికీ అదో మిస్టరీనే.
100 అడుగుల ఎత్తైన కొండను దొలిచి ఈ ఆలయం నిర్మించారు. అది కూడా పైనుంచి కిందికి చెక్కుకుంటూ రావడం ఈ ఆలయ నిర్మాణంలోని ప్రత్యేకత. దాదాపు 150 ఏళ్లు ఈ ఆలయాన్ని చెక్కినట్లు పురాణ ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఏడు వేల మంది కార్మికులు ఈ ఆలయ నిర్మాణానికి కష్టపడి పని చేసినట్లు తెలుస్తోంది.
అబ్బుర పరిచే అండర్ గ్రౌండ్ సిటీ
భారతీయ శిల్పకళకు ప్రతీక ఈ కైలాస ఆలయం. రామాయణ, మహా భారత, భాగవతాలకు సంబంధించిన గాధలను శిల్పాలుగా చెక్కబడ్డాయి ఈ ఆలయ గోడలపై. ఆ శిల్ప సౌందర్యం చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

మరో అద్భుతం ఏంటంటే, ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ వుందని మాట్లాడుకుంటారు. ఆలయం కింది భాగం నుంచి వున్న సొరంగాల ద్వారా ఆ అండర్ గ్రౌండ్ సిటీకి దారి వున్నట్లు చెబుతారు. కానీ, చిన్న పిల్లలు మాత్రమే దూరగల అతి చిన్న సొరంగాలు అవి.అంత చిన్న సొరంగాల ద్వారా వెళ్లి లోపల ఆ సిటీని ఎలా కట్టగలిగారన్నదీ ఇప్పటికీ మిస్టరీనే.
స్థల పురాణం:
ఈ కైలాస ఆలయ నిర్మాణానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కథ ప్రచారంలో వుంది. అనగనగా ఓ రాజు. ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైపోయారు. అది చూసిన రాణి మిక్కిలి బాధపడుతూ, అక్కడే వున్న కొండ (ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కైలాస మందిరం వున్న చోటు) పైకి చూస్తూ, పరమేశ్వరా.. నా భర్త ఆరోగ్యం నయం చేస్తే, నీకు ఇక్కడ గుడి కట్టిస్తా.. నీ గుడి శిఖరం చూసేంతవరకూ పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను..’ అంటూ ‘బాహుబలి’లోని రాజమాత రమ్యకృష్ణలా శపథం చేసిందట.

పరమేశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి రాజుగారి ఆరోగ్యం నయం చేశాడట. అంతట రాణి మొక్కు మేరకు ఆలయ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశారట రాజుగారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ వుంది. 100 అడుగుల కొండను దొలిచి ఆలయం కట్టాలి.. అందులోనూ ఆలయ శిఖరం చూస్తే కానీ, రాణి ఆహారం ముట్టనన్నదాయె.. అప్పటికే రాణి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వుంది.
పై నుంచి కిందకే ఎందుకు కట్టారంటే..
ఆమెతో ఆహారం ముట్టించాలంటే, ఆలయ శిఖరాన్ని చూపించాలి.. అందుకు ఏం చేయాలి.? అని ఆలోచించిన రాజుగారు మేధావులైన పండితులను పిలిపించి ఓ ప్లాన్ రెడీ చేయించారట. అందులో భాగంగానే ఈ ఆలయాన్ని కింద నుంచి కాకుండా, పై నుంచి అంటే శిఖరం వద్ద నుంచి చెక్కుకుంటూ వచ్చారట. అలా శిఖరాన్ని చూసిన రాణి ఆహారం తీసుకోవడంతో ఇటు రాజు, అటు ఆలయ శిఖరం చూసినందుకు రాణి సంతోషం వ్యక్తం చేశారట.
ఆ తర్వాత రాణి కోరిక మేరకు రాజు ఆ ఆలయాన్ని పూర్తి చేశారట. అదీ కథ. ఇది కథ జస్ట్ కథ మాత్రమే. నిజంగా ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారన్న పక్కా ఆధారాలు మాత్రం దొరకలేదింతవరకూ. ఏది ఏమైతేనేం, ఎక్కడా లేని విధంగా ఈ ఆలయాన్న భూతల స్వర్గంగా మలిచారు. ఎన్నో మిస్టరీలు దాగి వున్న ఈ ఆలయాన్ని వీలు చిక్కితే, ఒక్కసారైనా దర్శించి తీరాల్సిందేనబ్బా.!
మహారాష్ర్టలోని ఔరంగాబాద్కి 30 కిలో మీటర్ల దూరంలో ఈ కైలాస మందిరం వుంది.