ఊరికే స్టార్లు అయిపోరెవరూ. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇంకాస్త స్పెషల్. నటుడిగా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, అలా తనకు అంతటి అభిమానాన్ని ఇచ్చిన జనానికి మంచి చేయడం కోసం జనసేన పార్టీ స్థాపించారు.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం పవన్ కళ్యాణ్‌కి ఇష్టం. ఆయన ఏదైతే చెయ్యగలరో, అదే చెయ్యమని చెబుతారు అభిమానులకి. తాను ఆచరించనిది ఇతరులు ఆచరించాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోరు.
అన్నయ్య చిరంజీవి మెగాస్టార్. ఆయన నుంచి నటనను వారసత్వం అంది పుచ్చుకున్న పవన్ కళ్యాణ్, స్టార్డమ్ విషయంలో అన్నయ్యను మించి ఎదిగినా, ఆ అన్నయ్యలాగానే ఎదిగాక ఒదిగి వుండడం అలవర్చుకున్నారు.
సినిమాలంటే ఎందుకు భయం.?
‘రాజకీయాల్లో గొడవ పడటమంటే ఇష్టం. అదీ ప్రజల కోసమే. ఆ ధైర్యం ఇచ్చింది అభిమానులే. కానీ, సినిమాలంటే భయం. దానికి కారణం కూడా అభిమానులే. పాట ప్లే అవుతోంటే, అలా ఆ పాటని ఆస్వాదిస్తూ నడవడం నాకు ఇష్టం. కానీ, మీరేమో డాన్సులు కోరుకుంటారు. అందుకే భయం..’ అంటున్నారు పవన్ కళ్యాణ్.

‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అభిమానుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నడిపిస్తున్నది అభిమానుల అభిమానమేనని చెప్పారాయన.
ఫంక్షన్ అయిపోయాక ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలని అభిమానులకు సూచించారు. అభిమానులు ఆరోగ్యంగా వుండాలి, వారి కుటుంబాలూ ఆరోగ్యంగా వుండాలని ఆకాంక్షించారు.
‘ఇకపై డాన్సుల్ని నానుంచి ఆశించొద్దు ప్లీజ్..’ అంటూ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ కోరడం గమనార్హం. ‘అంటే సుందరానికీ’ నాని సినిమా అనీ, ఈ వేడుకలో తన ఏవీ వేయడం నచ్చలేదనీ, నాని ముందుండాలనీ, వ్యక్తిత్వం పరంగా నాని బలమైనవాడనీ పవన్ కళ్యాణ్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. హరీష్ శంకర్ దర్శకుడు. ఇదే మైత్రీ మూవీ మేకర్స్, ‘అంటే సుందరానికీ’ సినిమాని నిర్మించింది. నాని సరసన నజ్రియా ఫహాద్ నజీమ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.