Sologamy: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు.. ఓ పాటలోని లిరిక్స్ కోసం ఇదంతా వాడారు. పెళ్లంటే అర్ధం చెప్పడానికి వాడిన లిరిక్స్ ఇవి. అసలు పెళ్లంటే, అబ్బాయి – అమ్మాయి, ఆ తర్వాతే పైన చెప్పుకున్నవన్నీ.
హేమిటో.! ఇప్పుడు అమ్మాయి – అమ్మాయి, అబ్బాయి – అబ్బాయి పెళ్లిళ్లు కూడా చూస్తున్నామనుకోండి స్వలింగ సంపర్కం పేరు చెప్పి. అది వేరే సంగతి. ఏది ఏమైనా ఇద్దరుంటేనే అసలు సిసలు పెళ్లి.
కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లి సాలా సిత్తరమ్. సిత్ర ఇసిత్రమ్. ఒకే ఒక అమ్మాయి. పురోహితుని సమక్షంలో తనను తానే పెళ్లి చేసుకుంటోంది. ఈ ప్రక్రియను ‘సోలోగమీ’ అంటారట.
ఆ అమ్మాయికి పెళ్లి కూతురు కావడమంటే చాలా ఇష్టమట. అలాంటప్పుడు పెళ్లి కూతురు గెటప్ వేసుకుని చూసుకుని మురిసిపోవచ్చు కదా అంటారా.?
ఎవరి పిచ్చి వాళ్లకానందం. గెటప్‌తో పాటు, పెళ్లి సెటప్ కూడా సెట్ చేసుకుందీ అమ్మాయి. వేదమంత్రాలు, పురోహితులు, పెళ్లి పందిరి, అన్నింటికీ మించి, మంచి ముహూర్తం కూడా సెట్ చేయించుకుంది.

వింత పెళ్లికి, మంచి ముహూర్తం
జూన్ 11న ఈ వింత పెళ్లికి ముహూర్తం పెట్టించుకుంది. స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకుంటోంది ఆ అమ్మాయి. ఆ పెళ్లిని అహ్మదాబాద్‌లో వుండే తల్లి, దక్షిణాఫ్రికాలో వుండే తండ్రి వీడియో కాల్ ద్వారా వీక్షిస్తారట.
హబ్బా..! పిచ్చెక్కుతోంది కదా. ఎక్కినా నిజ్జంగా నిజమిది. దేశంలోనే ఇలాంటి పెళ్లి జరగడం ఇదే తొలిసారి అట. ఇంతకీ ఈ ఘనకార్యానికి శ్రీకారం చుట్టిన ఆ మహానుభావురాలు ఎవరబ్బా.! అనుకుంటున్నారా.?
ఆ డీటెయిల్స్‌లోకి వెళితే, ఆ అమ్మాయి పేరు క్షమా. గుజరాత్‌కి చెందిన యువతి. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తోంది క్షమా.
తగ్గేదే లే.. వెడ్డింగ్ కార్డులు – హనీమూన్
తనను తాను పెళ్లి చేసుకోవాలన్న ఈ ఆలోచనను మొదట తన తల్లి తండ్రులకు తెలిపింది. మొదట్లో వాళ్లూ కాస్తా విచిత్రంగానే చూశారు. అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.
చివరికి, కూతురి కోరికను అర్ధం చేసుకున్నారు. ఈ వింత పెళ్లికి వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ చేయించారు. వెడ్డింగ్ కోసం స్పెషల్ లెహంగా కూడా డిజైన్ చేయించుకుంది క్షమా.
గుజరాత్‌లోని ఓ ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరగనుంది. అన్నట్లు పెళ్లి తర్వాత హనీమూన్ కోసం గోవా టూర్ కూడా ప్లాన్ చేసుకుంది క్షమా. ఇది మరీ పైత్యంలా లేదూ.!